Friday, November 6, 2015

కీర్తన 222
-----
ఓరి దేవుడో దేవుడో తిరుమల దేవుడో
తీయ్యని పలుకేదిరో, కమ్మని కరుణేదిరో
తరతరాలుగా తాతలుతండ్రులు వేడినారు
తూచాతప్పక తీపునైవేద్యాలు నిచ్చినారు 
నీ భజన చేయుట భాగ్యమని చెప్పినారు
శ్రీవారి సేవ పూర్వజన్మసుకృత మన్నారు
తింటే గారెలు తినాలి
వింటే మహాభారతం వినాలి
వేడితే వెంకటేశున్ని వేడాలి
చెవునిల్లు కట్టుకొని చెప్పినారు
తప్పులు చేసినా తప్పటడుగులు వేసినా
తిరునామం మరువలేదు ఎన్నడు స్వామీ
తీపిపలుకు వినాలని కమ్మనికరుణ చూడాలని
తిరుమల వచ్చాను కనురెప్ప వాల్ఛక వేచాను
తీయ్యగ పలుకరించగ రావా తిరుమల స్వామి
కరుణతో చూడగరావా కమ్మని శీనయ్య స్వామి
ఓరి దేవుడో దేవుడో తిరుమల దేవుడో
తీయ్యని పలుకేదిరో, కమ్మని కరుణేదిరో

Monday, September 14, 2015


కీర్తన 248
-----------
దక్కితే మోక్షము దక్కకున్న సుఖము
మరువకురో నరుడా హరి నామము
విడవకురో నరుడా హరి పాదము
కలిమాయలో చిక్కి కొట్టుమిట్టాడక 
కలుషిత బంధనాలతో కలవరపడక
కరములెత్తి కొలవరొ హరి దైవము
కలిగించును హరి కరుణా భాగ్యము
అవధులు లేని తీరములు దాటించు
పొంతనలు లేని బంధములు తొలగించు
అంచులు లేని ఆనందములు కలిగించు
జన్మాజన్మాలు లేని మోక్షములు దక్కించు
ఎక్కరో నరుడా హరినామ భక్తి విహంగము
విహరించరో నరుడా స్వర్గాపురి ముక్తిమార్గము
చేర్చరో నరుడా జీవము శ్రీహరి సన్నిధానము
దక్కితే మోక్షము దక్కకున్న సుఖము
మరువకురో నరుడా హరి నామము
విడవకురో నరుడా హరి పాదము
కీర్తన 247
-----------
అందులోనే ఉన్నాడు ఆదిమూరితి
అందరికి అందుబాటులో ఆ ఆదిమూరితి
కొండలలో కొలువై కోరికలకు తడువై
కరుణాలవాలమైన కలి కరుణామూరితి
నిత్యమై నిఖిలమై నిలయమై నమ్మిన
నమ్మకముగా పలికే నారాయణమూరితి
అడుగో అల్లడుగో అందులోనే ఆదిమూరితి
అందరికి బంధువైన అనంతానంతామూరితి
సత్యధర్మ పరిరక్షకుడై సుఖధుఖ కారకుడై
సప్తగిరులలో అలరాడుచున్న సత్యమూరితి
అందులోనే ఉన్నాడు ఆదిమూరితి
అందరికి అందుబాటులో ఆ ఆదిమూరితి
కీర్తన 246
-----------
కష్టమాయితే నాకు నష్టమాయితే నాకు
ఇష్టముతో రామచంద్ర ఆదుకొంటివే
నాదు తండ్రి రామచంద్ర శ్రీరామచంద్ర
ఈ జన్మలో నీ మేలు నే మరువగలనా 
ఏ జన్మలోనైనా నీ ఋణము తీర్చుకోగలనా
జన్మజన్మలకు నీనామజపము వీడగలనా
పదములల్లె మహత్తర భాగ్యము కల్పించితీవి
మహాదానందపరుచుటకు ఏల మ్రొక్కవలెనో
సంతసింపజేయుటకు ఏల సేవచేయవలెనో
సెలవు నీయ్యరా ప్రభూ సీతారామచంద్ర
సంసిధ్ధుడనై నీ ఆనతి జవదాటక
సేవకుడనై నీ ఆజ్ఞ శిరసావహించెదను
నాదు తండ్రి రామచంద్ర శ్రీరామచంద్ర
కీర్తన 245
-----------
వేరే తీర్ధంబు అవనిపై వెదకనేలా
వేరే దైవంబు జగతిలో వేడనేలా
ఏడుకొండల వానిని వొదలి
ఏడేడుకొండల వానిని మరచి || వేరే తీర్ధంబు ||
కాలాతీతుడై కలకాలం కాపాడుచు
కరుణాసముద్రుడై కోరికలు కరుణించుచు
కమలాక్షుడై కనకములు కురిపించుచు
కొండలరాయుడై ఏడుకొండలలో కొలువైయున్న
ఏడుకొండల వానిని వొదలి
ఏడేడుకొండల వానిని మరచి || వేరే తీర్ధంబు ||
జగతికే మూలమైనవాడు
దేవగణానికి నాయుకుడైనవాడు
సకలభూతాలకు భుతాత్మడైనవాడు
సర్వాకాల సర్వాతీత శ్రీనివాసుడైన
ఏడుకొండల వానిని వొదలి
ఏడేడుకొండల వానిని మరచి || వేరే తీర్ధంబు ||
తల్లినై జన్మనిచ్చి
తండ్రినై సదాసంరక్షించి
గురువై జ్ఞానంభోదించి
దైవమై మోక్షానిచ్చు
ఏడుకొండల వానిని వొదలి
ఏడేడుకొండల వానిని మరచి || వేరే తీర్ధంబు ||
కీర్తన 244
-----------
పదమల్లి ప్రణమిల్లగా
పాపంబు హరియించె
జన్మంబు తరియించె
దిదృక్షాసక్తితో దర్శించగా
బంధంబు తొలగించే
జ్ఞానంబు ప్రసరించే
భక్తిశ్రద్దలతో మోహరించగా
సౌఖ్యంబు వరియించే
మోక్షంబు ప్రసాదించే
దరిచేర్చుకొని దయాసింధు
ఆలింగనంచేసే ఆత్మబంధు
కోరికలుతీర్చే పూర్ణకాముండు
ఏడుకొండల వేంకటేశుడు
కీర్తన 243
-----------
నీవు రాక పాట రాదే
నీవు లేక ఆట లేదే
మనసు నెరిగి మసులు కోరా
మమత పంచి మమ్మేలు కోరా
నాది యన్నది నాలో ఏది లేదే
రేపు యన్నది నే ఎరుగనే లేదే
పాడి పాడే తేనేటి ఊట నీకేరా
నాడి నాడే నేటి బతుకు నీదేరా
నీవెరుగక నేను ఏమీ చేయలేదే
నీకై జపించితపించిన తప్పుమీలేదే
హరినరహరి కృపకు నుడికారము చుట్టవేరా
హరిసిరిహరి ఇక ఆటపాటకు రావేమిరా
కీర్తన 242
-----------
మదనా కనులు మరలించవేరా
కామిని కలలు పండించవేరా
సుందరి సొగసులు భామిని వలపులు
సుందరా నీ కను విందుల కేనురా
నెచ్చెలి నందాలు జావళి జరదాలు
అంది అందుకోరా నీ పొందుకోరి వచ్చెరా
కోయిల స్వరాలు కోమలి కిలకిలలు
చెలికత్తెల సయ్యాటలు నీ సరసానికేనురా
సిగ్గేలరా జాగేలరా తెరలు మరుగేయరా
మందార మధురిమలను మరిగించరా
మదనా మరలించవా కనులు పండించవా కలలు
మదనా కనులు మరలించరా కలలు పండించరా
కీర్తన 241
-----------
ఆదిదేవునకు వందనం
అన్నమయ్యకు అభివందనం
వేనకువేల పాటల హరినందనం
పరమపురుషోత్తమునకు పరమానందం 
వేదవేదాంతునకు పదవిందువైభోగం
ఆలాపనాలాపనలకు అభివందనం
కొండ మీద కోటి రతనాల చందమామకు
కొమ్మమీద కోయిలమ్మ రాగాల చందనం
వేంకటేసునికి వీణాతరంగమృదంగవినోదం
కవితామృతహృదయానికి మనసావందనం
సప్తగిరుల సిరిబంధన హరికుందనానికి
సిరాలసరాల జల్లుల శృంగారరాసకేళీవిన్యాసం
పద్మావతిపతుడకు పంచామృతాభిషేకం
పదకవితామహునికి నా పాదాభివందనం
కీర్తన 241
-----------
దండెసుకో పూల దండెసుకో
దండానికి వరం వడ్డించుకో
పాడించుకో పాట పాడించుకో
ప్రణమిల్లినాను దరి చేర్చుకో
భక్తితో సేద్యము చేసినానురా
మనసున మొక్కలు పెంచినానురా
ఆర్తితో పదపూలు పూయించినానురా
నింగిలోని తారలన్నీ కోసినానులే
చమ్కీలుగా చుక్కలన్నీ అద్దినానులే
బంధమేసి బంతిచామంతి కట్టినానులే
పడ్డాను ఎండ కోరాను నీ అండ
ఎక్కాను కొండ తెచ్చాను దండ
దండెసుకో స్వామి పూలదండెసుకో
కనుల నిండా కనిపించు వరమిచ్చుకో
కీర్తన 240
-----------
హరి నామము మరచి
హరి గానము విడిచిన వేళ
నీ గతి లేక నే శృతిలో లేక
ఆపదల లోనై నిందలు పాలై
బంధాలు మొహాలు చేతచిక్కి
పాపములు పైగొంటిని రామ
హరి నామమే గతి నైన
హరి గానమే శృతి నైన వేళ
ఆకలిన ఆదరించి ఆపదల రక్షించి
మోహాల మరపించి బంధనాల విడిపించి
భవములు బాపి మోక్షమార్గామమున
మరలించి నడిపించితివి రామ
మరచిన నాకు గతి లేదు ఇక హరి
మరువక నే శృతి తప్పబోను శ్రీహరి
కీర్తన 239
-----------
ఈ సుఖము నీదే కాదా హరీ
ఈ సౌఖ్యము నీదే కాదా హరీ
కాసు లేనివాడికి కూడి వచ్చితివి
గూడు లేనివాడికి గుడి నిచ్చితివి 
దరి లేనివాడిని దారి మల్లించితివి
జోళ్ళు లేనివాడిని జల భూమ్యాకాశాన తిప్పివితివి
అణువణువున నీడై అడుగడుగునా తోడైతివి
పరుషములాడిన జిహ్వపై పదములు పలికించితివి
నిను కొలిచిన కష్టాలు కల్గునని
నినునమ్మిన నిమ్మకుండేవనన్నారు
కొలిచినా కొలవకున్నా నమ్మినా నమ్మకున్నా నన్నివేళల నాదుకొంటివి
నీ ఋణము నేనెలా తీర్చుకోగలను
నారాయణా వేంకటగిరి భక్తపారాయణ
కీర్తన 238
-----------
ఆరిపోయే దీపమా వెలుగులెందుకే
వెళ్ళిపోయే ప్రాణమా బంధాలెందుకే
కన్న బంధాలు కట్టుకొన్న అందాలు
కల్గిన చందాలు కూడిన సంపదలు 
కడకు రాకున్నాబిరబిరా పరుగులు
మిలమిలా మెరుపులు ఫెళఫేళా 
ఉరుములు ఎవరికే కరిగే మేఘమా
పుడమిని చీల్చేవు మొక్కై చిగురించేవు
రెమ్మై సాగేవు కొమ్మై కులికేవు
పువ్వై పూచేవు కాయై కాచేవు
పండై పండేవు పుడమిని చేరేవు
సృష్టిలో జనించిన సర్వజీవాత్మలు
చివరకు పరమాత్ముని చేరవలిసిందే
మరువక మనసెరిగి మసులుకోవే
విడువక వేంకటేశుని వేడుకోవే
కీర్తన 237
-----------
సుముఖమొ విముఖమొ నాకేల ఎరుగనయ్యా
అఖిల సామ్రాజ్య పాల నిఖిల నీరాజన రూపా
కీర్తించువాడనో కళంకంతెచ్చువాడనో నని
సందేహమేల నయ్యా సకల కళా వల్లభా
సుజన సువర్ణవర్ణచరిత్ర పవిత్రరఘువంశ పుత్ర
త్యాగరాజ సంకీర్తనామృత గాత్ర పవనజ స్తుతి చిత్ర
వాల్మీకి రమణీయ్య కావ్య కథానాయకా
ఎవరి తరమౌను నిను కీర్తించ
ఎవరి వశమౌను నిను నిందించ
నిను మెప్పించ నొప్పించ దలచిన మా భ్రాంతికాక
సోమసూర్యలోచనా రాగ సుధారస పావనా
సుముఖమని చెప్పవయ్యా మాయను మెప్పించుటకు
కీర్తన 235
-----------
కాంతా మాయామోహనమాయె నా మనసు
కాంతినిచిమ్మే చింతన కలుగకపోయెనే నా మనసు
కాంత మోహనుడై కోరరానివి కోరితినయ్యా కౌశల్య రామ
చింతన చేయక చేయరానివి ఎన్నో చేసితీనయ్యా సీతా రామ 
బంధాలన్నీ పులుముకొంటిని పాపాలన్నీమూటగట్టుకొంటినయ్యా
అజ్ఞానముతో అంధకారములో అలరించుచున్నదే నా మనసు
సుజ్ఞానముతో సుస్వరాగభరితమై సేవించేదెన్నడో నా మనసు
చెడు విలక్షణాలను చెంతచేర్చుకొని సంబరాననున్నదే నా మనసు
జ్ఞానవిచక్షణతో ధర్మార్ధకామమోక్షపరిరక్షకునికి దాసుడయ్యేదెన్నడో నా మనసు
వింతమాయ తొలిగేదెన్నడో కాంతా మోహము వీడేదెన్నడో
చితిలోనైనా కాంతమోహము కోరునో లేక చింత చేయునో
ఆశ్రితపాలక మోక్షదాయక మన్నించి ముక్తిమార్గమున మళ్లించు రామ
కీర్తన 234
-----------
పట్టరో రాముని పాదం
పెట్టరో యమునికి నామం
రాళ్ళనైనా కరిగించు పాదం
రాళ్ళలోనైనా ప్రకాశించు రూపం 
రాక్షసులను సంహరించు రామబాణం
రాగాలలో తేనెలోలికించు రామనామం
బ్రహ్మ కడిగిన బలి మోసిన పాదం
భవబంధాలను బాపు పావన తీరం
ధరణిని సదా రక్షించు ధర్మమార్గం
దైతలను దండించు దశావతారం
శ్రీవారిచరణ సేవలో కలుగును భాగ్యం
శ్రీరామనామస్మరణలో కలుగును మోక్షం
మాధవుని లీలలో మరణం మటుమాయం
వైష్ణవ వేడుకలో ఇక వైరాగ్యం కడు దూరం
కీర్తన 233
-----------
కనులలోన కలువలు దాచావో
కురులలోన జాబిల్లిని ముడిచావో
మదిలోన మరుమల్లెలై దాగావే
ఎదలోన సిగ్గుమొగ్గలై పూచావే
రతనాలు రువ్వావే రాగాలు పలికించావే
వెన్నెలై విరశావే జల్లులై కురిశావే
చూచానే నిలువుల బిగువులు
తలచానే వలచిన వలపులు
చిందించానే ముసిముసి నగవులు
నిలిపానే మనసున పూల సొబగులు
రావే రావే రతనాల అలిమేల హంస
వేంకటేశుని వడినచేరి వేడుకచేయవే
కీర్తన 233
-----------
కంటికి కానరమన్న కానరాడే
ఇంటికి రమ్మన్నా రానేరాడే
వేదములో లేనన్నాడే నాదములొ నున్నానన్నాడే
తరచి తఱచిచూడ తనలోనే నున్నానన్నాడే
రాయిని కంటే రాముడు కనరానన్నాడే
మంత్రం చదివినా మౌనంగా ఉన్నాడే
కోరి కోరి కొలచిన హృదయంలో కొలువవోతున్ననన్నాడే
ప్రేమతో పిలిచిన పలుకుతానన్నాడే
మనసున నిలిపిన ముంగిటవాలుతానన్నాడే
గుడిలోనున్నావో గుండెల్లోనున్నావో
కంటికి ఒక సారి కాన రారా
ఇంటికి ఒక సారి వచ్చిపోరా
నా గానము ఒకసారి వినరారా.
కీర్తన 232
-----------
కలహమేలరా కన్నా
కలువకన్నుల కన్నా
నామనసు నీకు మిన్న
నావలపు నీకు కన్నా
ఈ పొద్దు వదిలిపోవద్దురా కన్నా
ఒంటరిని ననుకానీకురా కన్నా
లోకమే నీవుగా బ్రతుకుతున్నా
ఆటపాటకు నీతోడుగా నేనున్నా..
మల్లెలిన్కా మాయలేదు
వెన్నెలఇంకా వాడలేదు కన్నా
సెలయేరు సద్దుమణగలేదు
తాపమింకా తీరంచేరలేదు కన్నా...
తీయ్యనైనా తీపిమనసు తహతహలాడేరా
రాధవలపు వెన్నమనసును కోరేరా కన్నా
కీర్తన 231
-----------
కరిగేనా ఈ కొండ దొరికేనా నీ అండ
ఆలపించిన ఆలకించి ఆపదలలో ఆదుకొనేనా
మేరుపర్వతముపై కొలువైనవాడు
నీలిమేఘాలలో తేలియాడువాడు 
నీలివర్ణ ఘనాగుణ సుందరుడు
నమ్మిన వారికి ఇక్కట్లు తీర్చెనా
కోరి కొండకు వచ్చి కొలచిన వారికి
కమ్మని ఇమ్మన వరములు వడ్డించేనా
ఇంకిపోయిన జీవానికి ప్రాణం పోసెనా
చితికిపోయిన బ్రతుకులకు చేరువాయెనా
కరిగేనా ఈ కొండ దొరికేనా నీ అండ
ఆలపించిన ఆలకించి ఆపదలలో ఆదుకొనేనా
కీర్తన 230
-----------
ఏది పుణ్యం ఏది పాపం
ఏది జ్ఞానం ఏది అజ్ఞానం
ఎవరికి ఏమి ఎరుక
ఏడుకొండల వేంకటేశునికి ఎరుక
జనన జీవన మరణ కారకుడై
జీవాత్మ పరమాత్మ సర్వభుతాత్మడై
కర్త కర్మ క్రియ తానైన వెంకటేశుడే
నేలునప్పుడు నడిపించినప్పుడు || ఏది పుణ్యం ||
పైపై చదువులు నిగనిగ మెరుగులు
మెరుగైన మాటలు వీనులసొంపులు
అనంతానంతమైన అంతరాత్మను ఆకళింపజేసుకొని
పరమాత్మను నెఱిగించు పరమవిద్య
ఎవరికి ఎరుక ఇది కలిమాయనేకాక || ఏది జ్ఞానం ||
సృష్టి లయకారుకుడై నిత్యాత్ముడై
సత్యాత్ముడై సకలకారక సర్వేశ్వరుడైన
శ్రీహరికే ఎరుక ఏది ఒప్పో ఏది తప్పో
ఏది పుణ్యం ఏది పాపం
ఏది జ్ఞానం ఏది అజ్ఞానం
కీర్తన 229
-----------
నింగినై వాలినాడు
నీటిచినుకై కురిసినాడు
నేలతల్లి దాహం తీర్చినాడు
కరిమేఘుడు కరుణాలవాలమై కురియగ 
మోక్షామృతము ఆలవాలమై పొంగగ
భక్తిభావజాల సుగంధాలు ఆవరించగ
కమలాక్షునివల్లి కలువై విప్పారగ
పొంగినఎద ఏడుకొండలై వెలవగ
శ్రీవల్లి ఒడిలో శ్రీహరి కొలువవగ
అదే సుందర సుమధుర శ్రీహరినిలయము
అదే పసిడిరత్నకాంతుల పావనమయము
ధర్మాధర్మ పాపపుణ్య పరిరక్షక నిలయము
మొక్కిన అదే మోక్షము
కొలచిన అదే కల్పవృక్షము
చూచిన అదే స్వర్గధామము
కీర్తన 229
-----------
కొలువైవున్నాడే దేవదేవుడు
కొండకోనలలో గుడిగుండెలలో కొలువైవున్నాడే
కనులకు చిక్కని కుంచెకు దొరకని
ఊహల కందని కథలలో వినని వేంకటేశుడు
సత్యమై ధర్మమై నిత్యా నందుడై
గోకుల మాకుల గాన గంధర్వుడై
హరుడై చక్రధరుడై సహ్రుదయుడై
శ్వేతాంబరధారియై సర్వపాపబాపకుడై
నిర్మలమనస్కుడై నిత్యశీతలశోభితుడై
ప్రాణకోటి ప్రాణేశ్వరుడై సజ్జనసంరక్షకుడై
కొండలలో కోర్కెలుతీర్చే కోనేటిరాయుడై
గుండెలలో బాధలుతీర్చే కొండలరాయుడై
కొలువైఉన్నాడే దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడు
కీర్తన 228
-----------
పలికెన్ మధురవాక్కులన్
పాడెన్ కాలకంఠంబునన్
వేడెన్ పద్మపాదంబులన్
రక్షింపంబని ధర్మాధర్మాంబులన్
దేవమునిగణముల్ మొర ఆలకించెన్
ఆలోచించెన్ అన్నపూర్ణబాధలన్
రక్షింప శ్రీహరి సమ్మతించెన్
నిలిచెన్ వేంకటేశుడై ఏడుకొండలన్
ఏలెన్ సర్వంతానై సర్వలోకంబులన్
సిరినొదలి భువికిపయనంబయ్యెన్
తిరుగాడె సామాన్యుడై సప్తగిరులన్
తెరలేపె హరి కలినాటకంబునకున్
విన్నసిరి సుర్రున కన్నెర్రజేసెన్
రాల్చె కన్నుల నిప్పురవ్వలన్
క్షీరసాగరసైతంబు సింధూరమాయెన్
మేల్కోని శేషుడు వేయిపడగలిప్పెన్
గ్రహించే రాబొవు విపత్తులన్
భీతిల్లెన్ .బ్రహ్మమహేశ్వరులున్
ఆదిదేవుని అంతర్యమును గ్రహింప
అలకవీడమని వినయంబున వేడెన్
సజ్జనసంరక్షణకై సిరి శాంతించెన్
శ్రీవారిని లాలింప సిరులు దొరలింప
భర్తఆనను జవదాల్చ భక్తుల కొంగు
బంగారమై భువికేగి హరి ఎదనిల్చెన్
కీర్తన 227
----------
ఉయ్యాలో ఉయ్యాలో రామయ్యకు ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో కృష్ణయ్యకు ఉయ్యాలో
అంబారి ఏనుగు నెక్కి ఊరేగే
ఆపదమొక్కులవానికి ఉయ్యాలో
అలిమేలమంగ ఒడిలో ఆదమరచి
నిదురోయే నాస్వామికి ఉయ్యాలో
శ్రితజనపాలక సీతారమణునికి ఉయ్యాలో
ఆశ్రితపక్ష అయోధ్యారామునికి ఉయ్యాలో
వేణుగానలోలా వృందావిహార ఉయ్యాలో
గోపిలోలా గోవర్ధనగిరిధార ఉయ్యాలో
తీయ్యని వరములు గుప్పించే తిరుమలేసునికి ఉయ్యాలో
సంకల్ప సిరులు సమకూర్చే సప్తగిరిశ్రీనివాసునికి ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో రామయ్యకు ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో కృష్ణయ్యకు ఉయ్యాలో
కీర్తన 226
-----
హరి నామము మరువలేక
హరి పాదము విడువలేక
ప్రాణము పోకరాక చింతన లేక
చింతాక్రాంతుడనైన సమయాన 
తిరుమలేశుని శరణుకోరి తిరిగి
శ్రీహరి సన్నిధి చేరిన తరుణాన
రాగము అనురాగమునాయే
గానము వేణుగానమునాయే
బంధము అనుబందమునాయే
ఆనందము మోక్షానందమునాయే
భక్తిలో మునిగి తేలుతూ
జ్ఞాన వైరాగ్యంలో విహరిస్తూ
హరిసంకీర్తానామృతము తాగుతూ
ముక్తిలో అనురక్తి చెందనాయే మనసు
హరే హరే............శ్రీహరే.............
నీ నామము పాదము శ్రీరామ రక్ష
కీర్తన 225
-----
మము పాలించే దేవా మహానంద
మము లాలించే దేవా మోక్షానంద
రాక్షసుల రాక్షసత్వం అణిచి
సర్వలోకాలను సంరక్షించి, 
భక్తజనావళి భవాలను బాపి
ఆనందమయంలో తన్మయత్వం చూపే
సహృదయవాసా సకలసృజనాధార
నిత్య సత్య బహుసుగుణా సుందరా
దుష్ట శిక్షన శిష్టరక్షణ ధర్మ సంస్థాపన
పాహిమాం పాహిమాం ప్రభోపరమేశా
మము పాలించే దేవా మహానంద
మము లాలించే దేవా మోక్షానంద
కీర్తన 224
-----
జాణ జాణజాణ నీ జాణతనమే చూచి
వాన వానవాన జడలనుంచి వెల్లువాయే
ఔరా నీఅందాలకు అతివలు అబ్బురమాయే
కలువ కన్నులు కలవరంతో విప్పారెనాయే 
త్రిభువనాలు తేనెటీగలై చుట్టూ తిరిగినాయే
నందాల తారకవో నటనాభినయనతారకవో ||జాణ ||
త్రిశూలుడైనా అసురుడైనా తన్మయత్వంతో
తమను తాము మైకంతో మైమరచినాయే
మనసు మేఘమై మిన్నున మెరెసెనాయే
అందాలసుగుణరాశి చెంత ఆకర్షితమాయే ||జాణ ||
అసురులు అసువులు బాసినాయే
సురులు అమృతంతో అమరులాయే
హరిహరనాధుడే ఉద్భవించెనాయే
హరిలీలామృతాలలో మోక్షందక్కినాయే ||జాణ ||
కీర్తన 223
-----
గోవినూదువాడే గోవులు కాంచువాడే
గొల్లభామల గుండెలలో కొలువైనాడే
కాళంగిని అణుచువాడే కొండనెత్తువాడే
కాటుక కల్ల కొనగొంటి చూపులతోన 
కలువ కన్నులకు కనువిందుచేయువాడే
కోమలి మనసులు కొల్లగొట్టువాడే
కపటమైనవాడే కలహించనివాడే
అందిఅందని అందగాడే అందరివాడే
బంధాలు నేయువాడే బంధీకానివాడే
మనఅందాల అతివల పొందుకోరువాడే
జీవులెల్ల జాబిల్లిలా జాలికలిగినోడే
పాపాల ప్రాణులెల్ల పాతరేయువాడే
మోక్షాల మనసులెల్ల జాతరచేయు
గోవిందుడు వాడే ఏడుకొండల వాడే...

Monday, August 3, 2015

కీర్తన 221
-----
అక్కడైన ఇక్కడైన ఎక్కడైన విష్ణుడొక్కడే
ఒక్కడే ఏడుకొండలలో కొలువైన విష్ణుడొక్కడే
వామునడైన విశ్వరూపుడైన విష్ణుడొక్కడే
వేదమునైనా నాదమునైనా విష్ణుడొక్కడే
శాంతమైన చల్లనిచంద్రుడు లో నైనా.
ఎర్రని సుర్యుడై దూకే సింహములోన విష్ణుడొక్కడే
అన్ని రూపములలో అన్ని ప్రాణాలలో
అన్ని తానైన రూప మొక్కటే విష్ణుడొక్కడే
కీర్తన 220
-----
గారాల పట్టికై గానము చేసి
గారవముతోడి పిలిచేడులే
నెరనమ్మిన వానికై నెదురు చూసి
నెరజాణ నెపముతోడి పరిగెడులే
మధురాలు ఒలికించే ఆమాట వింటేనేచాలు
మనసేను పులకించి సుమమెల్ల వికసించేనులే
అధరాలు పలికించే ఆవేణు మోగినచాలు
నందాలు నర్తించి వనమెల్ల పరవశమాయెలే
సత్యమును నెదుకుతు ఆ సుందరి
సౌజన్యమును కొరకు ఈ సుగుణము
సరాగాలు పాడి సయ్యాటలాడేరులే
సొలసిన వేళ ప్రీతీతో ఒడిని చేరునులే
గారాలు ప్రియమై గోలోలుడు విరహమై
యమునను దాటి గోకులమున విహరించెలే
మేఘాలు మురిసి మొహాలు కురిసి
ప్రణయగీతికలు పాలపుంతలై పరవళ్ళు తొక్కెనులే
కీర్తన 218
-----
కన్నుల్లో నీరూపం కలకలలాడే
గుండెల్లో నీగానం గలగలలాడే
కొంగుచాటు దాగకు రా కన్నాకన్నా
కొమ్మమాటు చేరకు రా కృష్ణా కృష్ణా
నీలి నిగనిగలు నగవులను ఊరిస్తుంటే
కలువకన్నులు కొలనందాలను కవ్విస్తుంటే
ఆగలేక ఆపలేక అలాగని నిన్నే చేరలేక
కాచలేక ఓపలేక కానీ నీవు కానరాక
తిరిగి వెళ్ళలేక మువ్వ మారాము చేసింది
మౌనముగా వేడుకోంది మురిపెంగ పిలిచింది
నీకొండగొడుగు కింద తానే చేరిపోవాలని
నీగుండె లోతుల్లో తానే దాగిపోవాలని
ఉవ్విళ్లూరుతోంది వన్నెల వలపు
ఆశగా పిలిచింది అందాల తలపు ..
కొంగుచాటు కొమ్మమాటు దాగమాకురా
కన్నియ గుండెలలోన మాటువేయరా
కీర్తన 219
-----
దాచుకోనా దేవా దాచుకోనా
నాహృదయంలో పదిలంగా దాచుకోనా
చూసుకోనా స్వామీ చూసుకోనా
నాకనులలో కట్టేసి భద్రంగా చూసుకోనా
నామది నందన వనముగా మలుచుకోనా
సుందర సుమధుర పదములతో అల్లుకోనా
ఎదన ప్రేమాలంకిత పూదండనై హత్తుకోనా
పదార్చనలతో నీ పాదములు పూజించుకోనా
నాగుండెల్లో గర్భగుడి గట్టుకోనా
నా దేహము దేవాలయముగా దిద్దుకోనా
మేళతాళాలు వేదమంత్రాలతో వేడుకచేసుకోనా
పాదాలచెంత భక్తిపువ్వునై రాలిపోనా
సంకీర్తనా సుస్వారాల జల్లు కురిపించనా
సన్నిధిన సుపరిమాళాలు వెదజల్లనా
హరినామస్మరణలో నే హారతినై కరిగిపోనా
ఆత్మను పరమాత్మునికి ఆర్పితం చేసుకోనా
కీర్తన 217
-----
బండెల్లి పోతున్నది మామ కొండకెల్లి పోతున్నది
పొలిమేర దాటుతోంది ఏడుకొండలకు వెళుతోంది
గొడ్డుగోద నొదలి నే రాలేనే పిల్లా
ఇల్లువాకిలి నొదలి నే వెళ్ళలేనే పిల్లా
పొలముపార నొదలి నే పరిగెత్తలేనే పిల్లా
గోపాలు డొచ్చి నీ గోవులును గాసేడు
పరంధాము డొచ్చి నీ పొలము దున్నేడు
ఇలవేల్పునై వొచ్చి నీ ఇంటిని కరుణించేడు
చపల చిత్తమైన మనసు మారకముందే
క్షణము చిత్తమైన బ్రతుకు మాయకముందే
వెళ్ళివద్దాము ఏడుకొండలకు చూసోద్దాము శ్రీనివాసుని
బండెల్లి పోతున్నది మామ కొండకెల్లి పోతున్నది
పొలిమేర దాటుతోంది ఏడుకొండలకు వెళుతోంది
కీర్తన 216
-----
అటుచూస్తే నాంచారి ఇటుచూస్తే సింగారి
నట్ట నడుమన నాస్వామి నారాయణ హరిహరి

అటుచూస్తే కావేరి ఇటుచూస్తే గోదారి
నట్ట నడుమన నాస్వామి కృష్ణయ్య హరిహరి 
క్రిందచూస్తే భూదేవి పైనచూస్తే సిరిదేవి
ఏడుకొండలపై నాస్వామి వేంకటేశుడు హరిహరి
మూడునామాల వాడు ముల్లొకాలు నేలువాడు
ముక్కోటి దేవగణము మొత్తంగా మొక్కినవాడు
ముక్కంటి ఈస్వరుడే మైమరచి మనసైనావాడు
ముద్దుగుమ్మల మధ్యలో నలిగిన ఘనుడేవాడు
ముగ్గురు తల్లుల ముద్దుల తనయుడు వాడు
ముప్పేటబాణాలు కురిపించి మెరిపించన రఘువీరుడు వాడు
మొక్కిన వారికి వరములు దొరలించు కొండలరాయుడు వాడు
మొత్తంగా దివినుంచి దిగివచ్చిన కలియుగ వేంకటేశుడు వాడు
కీర్తన 215
-----

ఏకాంతమున గాని వేదాంతమున గాని
హరినెరుఁగ నెవరితనము నంత భ్రాంతిగాని
ఆదిమధ్యనంతములేని అనంతానంతమైన
విభునివర్ణింప నెవరితనము నంత కల్పితముగాని
ఆత్మనో జీవాత్మనో సర్వభూతాత్మనో పరమాత్మనోనైన
సర్వేశ్వరుని సేవింప నేకరములవశము నంత ఆడియాసగాని
పాతాల జలభూతల సూర్య చంద్ర నక్షత్ర గోకుల స్వర్గ మండల
నేలుహరిని కనులారా దర్శింప నేనేత్ర తరము నంత కట్టుకధలగాని
కపట నాటక సూత్రధారి నాడిన్చు నాటకాన నామమాత్రులమునే గాని
గిరిని దాటి హరిని చేరుటకు జగన్నాటకానికి తెరలు దించుటకు నేప్రాణవశము

Sunday, February 15, 2015

కీర్తన 214
-----
ఎక్కాడున్నోడో నాసామి ఏడుకొండలవాడు
ఎందునున్నాడో నాసామి ఏడుకొండలవాడు

ఎంత వెదికినా కానరాడు ఎంత  వేడినా దొరకరాడు
పంత మిడిచి పలుకు వినరాడు ప్రేమతో పలుకరాడు

బెట్టు చేద్దామంటే మనసు మాట వినక పోయే
ఇట్టు వద్దాములే అని ఆసామి అనుకోక పోయే

ఏరీతిన కొలిచిన ఎదురేగి వస్తాడో ఎరుక కాకపోయే
ఏరువాకై ఏడుకొండలవాడు కరుణతో సాగిరాకపోయే

నే పోలేక  నాసామి  రాలేక చిక్కుముడి కొలిక్కిరాక
అడకత్తెరలో పోకచెక్క సామెతాయె నా బతుకు
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందాగోవింద

Monday, February 9, 2015

కీర్తన 213
-----
వేదంబు వెతికితిని విశ్వంబు వెరచితిని
వెంకటేశుడే విష్ణువని నెరుగుక నేను

ఏడుకొండల వానిపై విశ్వాసంబు నుంచక
అచ్చటఇచ్చట ఎచ్చటనెచటనో వెదకితి నేను
వెంకటేశుడే విష్ణువని నెరుగుక నేను

అందరిని ఎందరేందరో దేవ్వుళ్లుని ఆరాధించితిని
ఆలిమెలమంగాపతుడే అన్తరాత్మని నెరుగుక నేను

రామాయని జపిన్చితిని కృష్ణాయని కొలచితిని
నారసింహుని నమ్మితిని హరియని కీర్తించితిని
యన్నీ వేంకటహరిరామకృష్ణనారసింహమని నెరుగక నేను

ఏడుకొండల వాడే నాపాలి దైవమని
వెంకటేశుడే మన అందరి దైవమని నెరుగక నేను
కీర్తన 212
-----
వాడే బంధము వాడే గంధము
వాడే వేదము వాడే శాస్త్రము

ఒడలకు వంటబట్టే మంచిగంధము
తరాలకు తరిగిపోనీ తీపిబంధము

రాసుకొన్న మాపుకొలేని రామగంధము
దుర్మతలను దరిచేర్చని దేవగంధము

కరిగిపోనిది తరిగిపోనిది కృష్ణబంధము
భవబంధాలు బాపేటి భక్తి బంధము
జారిపోనిది జన్మజన్మలబంధము

వేదములు వెదకి వెదకి చూడ
శాస్త్రములు తరచి తరచి చూడ
వేదాల సారంబు శాస్త్రాల మూలంబు
హరియె దైవము శ్రీహరియె సర్వము

కీర్తన 211
-----
ఇహము పరము హరియె
ఇంతయు అంతయు హరియె

హరి నామమే వేదము శ్రీహరి నామమే సారము
జగములెల్ల జీవములెల్ల జీవము హరి నామము

విడువక మరువక జాగుచేయక వేడుకో మనసా
సకల దేవతుల సకల మునుల సరక్షకుడైన ధరణి దివము

చక్కని చిక్కని చిద్విలాసుడైన శ్రీహరి రూపము
గుడిలో ఒడిలో కొలువైన గోవిందుని రూపము

గురుతెరిగి క్రమమెరిగి కొలవవే మనసా
హరి నామమే వేదము శ్రీహరి నామమే సారము

కీర్తన 210
-----
దాచుకోనీరా...........దేవా................
నీ రూపాన్ని నా నయనానా ............

మలుచుకోనీరా.......దేవా................
నీ భావాన్ని నా హృదయానా...........

పాటల పెన్నిధి కానా నీ సన్నిధిన నేను
మువ్వలసవ్వడి కానా నీ ముంగిట నేను
దాచుకోనీరా... మలుచుకోనీరా... దేవా...
నీరూపాన్ని నా నయనానా హృదయానా..

అమృతమై వర్షించనా నీ అందికన నేను
పాలకడలినై పొంగనా నీ పొంతన నేను
హత్తుకోనీరా... మెత్తుకోనీరా... దేవా...
నీ భావాన్ని నా ప్రాణాన నా భావాన....

దండనై ఒదిగిపోనా నీ డెందమున నేను
పువ్వునై రాలిపోనా నీ పాదమున నేను
కల్పించరా కల్గించరా నీ సేవాభాగ్యము
స్వీకరించరా సప్తగిరి చిద్విలాసా నాసేవలు

ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద
కీర్తన 209
---------
వెన్నల కాసే దేవుడు వేంకటగిరి విభుడు
శంఖ చక్రధరుడు సప్తగిరి శ్రీనివాసుడు

సకల కళా వల్లభుడు సర్వ భూతాత్ముడు
సర్వ శాస్త్ర కోవిదుడు సృష్టిలయ సర్వేస్వరుడు

సుగుణా సుసంపన్నుడు సర్వలోక సర్వోత్తముడు
స్వర్గాపురి చిద్విలాసుడు సకల పాప బాపాకుడు

మోక్ష మార్గదర్శకుడు మహిమాన్వితుడు
ఘనా ఘన సుందరుడు గీతా బోధకుడు

ధరణీ పాలకుడు ధర్మాధర్మ పరిరక్షకుడు
దాసాను దాసుడు హరిదాస సంరక్షకుడు

నమ్మిన చాలు వెంకటేశుడిని వేడిన చాలు
వరములు దొరలించు వేంకటగిరి వైకుంఠ నాధుడు
కీర్తన 208
---------

రావే రావే రామ చిలుకా
రామ రామయనవే రామ చిలుకా

తేనెలొలుకు ముద్దు మాటలతో తారక
రాముని మురిపించవె తోటలోని రామ చిలుకా

నీ పలుకే బంగారం పంచెవన్నెల చిలుకా
పరమాత్మునికి అదే అంతులేని పరవశమే

నిను చూచి చూడగనే మువ్వన్నెల చిలుకా
నీవు పలికి పలుకగనె పంచదార చిలుకా

ముగ్గురుతల్లుల తనయుడు ముచ్చటనాయే
తన నామమే నాభరణముగా నేసే నీ మెడలో

నీవు వాలీవాలగనె రామ చిలుకా
కంచెర్ల గోపన్ననాయే రామదాసు

కీర్తన 207
-------
చూడరమ్మ సతులార సుందరరూపం
మగువలు మనసుదోచిన మోహనరూపం
వేవేలగోపెమ్మలు వలచిన వైకుంఠనాధునిరూపం
పదారువేలభామల పతియైన పురుషోత్తమనిరూపం
నిరతము నిను కాంచు శ్రీమన్నారాయణ సింహరూపం
ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటపతి వేడుకరూపం
చూడరమ్మ సతులార సుందరరూపం
మగువలు మనసుదోచిన మోహనరూపం
కీర్తన 206
---------

స్వామి స్వామి నీవు పన్నీరు
స్వామి నీ కరుణ లేకుంటే కన్నీరు
సామి....సామి...... స్వామి స్వామి

చూపగ రావా సామి నీ కరుణా
చేరగ రావా సామి ఈ తరుణాన

స్వామి ఏడుకొండల వెంకటేశ సామి
తారా తారా ....తారారే తారే...హరే
పాపలెన్నో చేసి తిరుమల చేరాను
నీ పుణ్యంతో శంఖంలో తీర్ధంనైనాను

స్వామి ఏడుకొండల వెంకటేశ సామి
వేదం చదివాను మంత్రం నేర్చాను

నీనామం జపించాను నిన్నే నమ్మాను
దాసుడనయ్యాను హరిదాసుడనయ్యాను
స్వామి ఏడుకొండల వెంకటేశ సామి
కీర్తన 205
-----------

మార్గలెన్నైనా మోక్షానికేలె
మొహాలన్ని విడిచి మనసు
లగ్నము చేసిన మోక్షం చెంతనేలే

యుగములుగా దొరకనిది
క్షణమున చేరువవునులె
హరి హరి యని పదే పదే
తలవవొ మనసా కొలవవొ మనసా
కీర్తన 204  

-----------
జాతర జాతర నినుచూసి వచ్చే జాబిలి
జాబిలి జాబిలి నినుచూసి నవ్వే కోమలి

రెమ్మనై సాగింది కొమ్మకు పూచింది 
దండను చేరింది కలవరమున వేచింది

వీరుడై వచ్చినాడు విల్లునే విరిచినాడు 
చూపులే వాల్చినాడు వెన్నెలై నిలిచినాడు

కలువ నవ్వింది కనులు కలిపింది 
ఎదన చేరింది ఏడడుగులు వేసింది

గోదారిగట్టు భద్రాద్రిమెట్టుపై పొంగింది వయసు
గుండెగూటిలో గువ్వనై ఒదిగింది మనసు

చందమామకు చక్కాని సీతచుక్క తోడునాయే 
గోరువంకకు వన్నెల రామచిలుక జోడునాయే

జాతర జాతర నినుచూసి వచ్చే జాబిలి
జాబిలి జాబిలి నినుచూసి నవ్వే కోమలి
కీర్తన 203 
---------
ఆగ్రహించక అనుగ్రహించర దేవాధిదేవా 
కన్నెర్రచేయక కనికరించర నన్నుబ్రోవా

నీవు కాదన్న నను బ్రోవువారెవ్వరు 
నీశరణు లేకున్న రక్షించు వారెవ్వరు
నిను నమ్మినవాడను నిమిత్తమాత్రుడను 
నారాయణ  హరినారాయణ భక్తపారాయణ

ఈరేయికి వెలుగువై ఈప్రాణికి జిలుగువై
నాబాటకు తోడువై నడిపించగ రా.. రా..
ఈఆటకి యుక్తివై ఈనాటకానికి ముక్తివై 
నను బ్రోవరారా నను కానగ రారా హరే...

మెరిసేటి మేఘమై ఉరిమేటి సింహమై 
అలవికాని అంపవై ఆఘమేఘాన రారా 
నారాయణ హరినారాయణ వేంకటనారాయణ
ఆగ్రహించక అనుగ్రహించర దేవాధిదేవా
కీర్తన 202
---------
చూడరో చూడరో సుందరగిరులు
శోభాయమానమైన ఆ సప్తగిరులు

దేవతలకు దేవుళ్ళకు దేవాలయాలు
వేదాలకు నాదాలకు నిలువుటద్దాలు
మునులకు తపోధనులకు మోక్షాలయాలు
భక్తులకు శరణాగతులకు శరణాలయాలు

చూడరో... చూడరో...సిరిహరి సుందరగిరులు
చూసి తరించరో సిరిచందన హరినందనగిరులు

వైష్ణవులకు అదే వేదవైకుంఠసారాలు
శైవులకు అదే శివతాండవకైలాసశిఖరాలు
కులము లేకున్న కైవల్యకరుణాసాగరాలు
మతము లేకున్న మోక్షానికిముక్తిమార్గాలు

వేడినావేడకొన్నా వరములు నొసిగే వేంకటగిరులు
కొలచినాకొలవకున్నా భవములు హరించే కర్మగిరులు
అడుగడుగునా హరి సంచార సుగుణాలవాలములు
హరినామస్మరణతో అలరాడుతున్న అమృతతరంగిణులు
చూడరో... చూడరో.. చూసి తరించరో శ్రీ సప్తగిరులు
కీర్తన 201
------------
దాసుడనైతిని ఓ రామ నేను ధన్యుడనైతిని శ్రీ రామ
నీకృపగొంటిని ఓ రామ నేను కృతార్థుడనైతిని శ్రీరామ

బంధువుగా భావించి మాయాబంధనాలు త్యజించి 
నీభావాలలో విహరించి కవికట్టి కవయించి శ్రీరామ
మోహాలోకము విడిచి నీభక్తిభావాలోకంలో తడిచి 
నీయావాలోలుడనై నీ సన్నిహితుడైతిని శ్రీరామ


ఇలలో నిను స్తుతించి కలలో నిను దర్శించి శ్రీరామ 
నిరతము నిను భజించి నిత్యసంతోషినైతిని శ్రీరామ
నను పుణ్యగంగన ముంచి పావనక్షేత్రమునకు మర్లించి
పునీతుడకావించిన నీకు పాదదాసుడనైతిని శ్రీరామ

రాగము పాడించి సన్మార్గమున నడిపించి రామ 
నా గండములు గట్టెక్కించి గోపురము గట్టించి రామ 
వేంకటరమణుడువై విడువక ఏడుకొండలు ఎక్కించిన 
వేళ జన్మచరితార్ధమై రుణానుబంధుడనైతిని శ్రీరామ